`మంచు’ ముత్యం


మీరు ప్రకృతి అందాలను ఆస్వాదించి ఎన్నాళ్లయింది? తెల్లవారుజామున దట్టమైన పొగమంచు, ఆ మంచు తెరల చాటున ఉదయభానుని లేలేత కిరణాలు, వాటి చాటున దాగున్న పుష్పాల సోయగాలు. ఇది మాటల్లో  కాదు.. దృశ్యరూపంలో చూస్తే ఆ అనుభూతే వేరు. అందుకే నిజమైన పల్లె అందాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
పొగమంచు సోయగం.. పరవశించేలా ఉన్న ప్రకృతి అందం.. ఉదయభానుని లేలేత కిరణాలు పుడమితల్లిని ముద్దాడకముందు.. మబ్బుల మాటున దోబూచులాడుతూ చందమామ.. కనీకనిపించనట్టుగా తెరలు తెరలుగా కమ్ముకున్న పొగమంచు.. అబ్బా! ఈ దృశ్యాలను తనివితీరా ఒక్కసారైనా చూడాల్సిందే.
రవిగాంచని చోట.. కవిగాంచునులే అన్నారు. నిజమే.. భానుడి నులివెచ్చని అరుణ కిరణాలు పల్లె నేలను తాకకముందే… మనసును అల్లుకున్న మబ్బుపొరల్లా ఈ ప్రదేశాన్నంతటినీ కమ్మేసింది పొగమంచు. ఒక్కో తెరని తొలగించుకుంటూ వెళితే… అరుదైన, అద్భుతమైన, అపురూపమైన ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. రారమ్మని పలకరిస్తాయి.
ఎంత చూసినా తనివితీరదు. చూడకపోతే మనసూరుకోదు. అదీ ఈ ప్రకృతి అందాల ప్రత్యేకత. ఈ సోయగాలను కనులారా తిలకించాలంటే ఎక్కడికో వెళ్లిపోనక్కరలేదు. మన రాష్ట్రంలోనే కృష్ణా జిల్లాలో ఏ పల్లె గడప తొక్కినా.. కోస్తాంధ్రలో ఏ ప్రాంతానికి వెళ్లినా… పచ్చని ప్రకృతి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. తెలతెలవారకముందే మనసారా స్వాగతం పలుకుతుంది. తన అందాలను ఆరబోస్తుంది. చూసినవారికి చూసినంతగా కనువిందు చేస్తుంది.
ఇవాల్టికి ఇక సెలవు అంటూ వెళుతున్న చందురూడు… నేనొచ్చా అంటూ తన నులివెచ్చని కిరణాలతో పలకరించే సూర్యుడు… తన అందాన్ని కనులారా వీక్షించమని చెప్పే ప్రకృతి… రాత్రి నిద్రమత్తును వదిలించేలా.. అలసిసొలసిన కనులకు విందు చేసేలా కనిపిస్తాయి ఈ సుందర దృశ్యాలు.
కాలుష్యపు మేఘాలతో, వాహనాల రణగొనుధ్వనులతో తెల్లవారే నగరవాసులకు ఇలాంటివి నిజంగా అపురూపమే. అద్భుతమే. మంచు దుప్పట్ల మధ్య ధవళ వర్ణంలో మెరిసిపోయే పూల సోయగాలు, పొగమంచును ఒడిసిపట్టి.. దానిని కరిగించి.. నీటిగా మార్చి.. తన పరువపు ఒంటిపై నుంచి ముత్యాల్లాంటి బిందువులను జాలువార్చే పచ్చని ఆకుల జిలుగువెలుగులు… ఇలాంటి దృశ్యాలను చూడకపోతే.. మన కళ్లకు మనం అన్యాయం చేసినట్లే.
ఒయ్యారాల ఒంపుసొంపులతో… ప్రకృతి మాత చేతిలో రూపుదిద్దుకున్న పదహారేళ్ల పడుచు సొగసులా.. కులుకులొలుకుతూ మలుపులతో జోరుమీద సాగిపోయే బుడమేరు ప్రవాహం…
ఇక్కడికి ఒక్కసారి అడుగుపెడితే.. మధ్యలోనే మిమ్మల్ని అడ్డగిస్తుంది ఈ సాలీడు. ఇదంతా తన లోకం అంటూ పెద్దగా అల్లుకున్న పొదరిల్లులాంటి సాలెగూడును చూపిస్తుంది.
ప్రకృతిమాత పచ్చని చీర కట్టుకుందా అన్నట్టున్న కనుచూపుమేర కనిపించే ఆకుపచ్చని పొలాలు.. పక్షుల కిలకిలారావాలు… కళ్లను, మనసును, మెదడును అన్నింటినీ కూల్ కూల్ అంటాయి.
నిద్రమత్తులో జోగుతూ, కాలుష్యపు మేఘాలతో నిండిన నగరాలను వదిలి… సహజసిద్దమైన అందాలతో అలరించే పల్లెటూళ్లను చూడండి. శీతాకాలంలో వాటిని అందాలను తనివితీరా ఆస్వాదించండి. అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకోండి.
- బాలు
guna_716@yahoo.co.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!