గాలి వర్గం కాంగ్రెస్ కు దగ్గర అవుతుందా!
అక్రమ ఖనిజ మైనింగ్ కేసులో జైలుపాలైన గాలి జనార్ధనరెడ్డి మెల్లగా కాంగ్రెస్ కు దగ్గరవుతారా? రాజకీయ వర్గాలో ఆసక్తికరమైన ప్రచారం ఒకటి జరుగుతోంది. కర్నాటకలో బిజెపితో సంబంధాలు తెంచుకోవడం, కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ద్వారా సిబిఐ గండం నుంచి బయటపడడం కోసం గాలి జనార్ధనరెడ్డి సన్నిహితులు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కర్నాటకలో ఈయన మద్దతుదారుడైన మాజీ మంత్రి శ్రీరాములుకు మద్దతు ఇస్తున్న ఇద్దరు బిజెపి ఎమ్.పిలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అంతేకాక భవిష్యత్తులో సుమారు పది మంది బిజెపి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు తిప్పడంలో గాలి సన్నిహితులు ముఖ్య భూమిక పోషించవచ్చని భావిస్తున్నారు. తద్వారా కర్నాటకలో బిజెపిని బలహీనపర్చడానికి గాలిని ఒక పావుగా కాంగ్రెస్ ప్రయోగించవచ్చని అంటున్నారు. దీనికి తగినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ వర్గంలో ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సొంత గూటికి పంపించడానికి కూడా ప్రయత్నాలు ఆరంభమయ్యాయని అంటున్నారు. గాలి జనార్ధనరెడ్డి సమీప బందువైన పాణ్యం సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కు దగ్గరవడానికి వీలుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారని అంటున్నారు. ఆయనతోపాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా అదే ప్రకారం కాంగ్రెస్ కు దగ్గర కావచ్చు. కాపు రామచంద్రారెడ్డి గాలి కంపెనీలకు సంబందించిన వ్యక్తే. ఆయన కనుక జగన్ కు దూరం అయ్యే పక్షంలో ఈ వ్యూహం పై జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని తేలుతుందని భావిస్తున్నారు. పైగా వై.ఎస్. జగన్ నుంచి కూడా ఈ ప్రయత్నాలకు ఎలాంటి ప్రతిఘటన ఉండదని కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కష్టాలలో ఉన్న గాలి జనార్ధనరెడ్డి అనుసరించే కాంగ్రెస్ వ్యూహం సఫలం అవుతుందా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి