ప్రజలపై విద్యుత్ చార్జీల మోత
తెలంగాణ సమ్మె ప్రభావంతో పాటు విద్యుత్ సంస్థలలో ఆర్ధిక సంక్షోభం ప్రభావం మొదలైంది. ప్రజలు కరెంటు భారాన్ని మోయవలసిన పరిస్థితి వచ్చింది. యూనిట్ కు ఏభై పైసల చొప్పున అదనంగా వసూలు చేయాలని విద్యుత్ సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి.ఈ భారం ఈసారి మూడు వందల యూనిట్లు లోపు వాడేవారికి విధించాలని నిర్ణయించడం విశేషం.మూడు వందల యూనిట్లపైబడి వారిపై ఇప్పటికే రేటు అధికంగా ఉన్నందున ఈ ప్రతిపాదన చేసినట్లు కనబడుతోంది.అయితే సామాన్య వినియోగదారులకు తీవ్ర భారం అవుతుందని విమర్శలు వస్తాయి. అయినా వందల కోట్ల రూపాయలు పెట్టి విద్యుత్ కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడినందున ఈ భారం ప్రజలు మోయకతప్పదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే ప్రజల నుంచి వ్యక్తం అయ్యే నిరసనను దృష్టిలో ఉంచుకుని ఏమైనామార్పులు చేస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం ఏభై యూనిట్ల లోపు వాడేవారి నుంచి యూనిట్ కు రూపాయి నలభై ఐదు పైసలు చొప్పున వసూలు చేస్తుండగా అది ఇప్పుడు రూపాయి తొంభై ఐదు పైసలు అవుతుంది.అలాగే ఆ తర్వాత స్లాబ్ మూడు రూపాయల ముప్పై పైసలకు తదుపరి మూడు రూపాయల ఏభైఐదు పైసలకు, రెండువందల యూనిట్ల నుంచి మూడు వందల యూనిట్లకు ఇప్పుడు ఉన్న రూ.4.75 బదులు 5.25 రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. విద్యుత్ రెగ్యులేటరీ అధారిటీ క్లియరెన్స్ ఇస్తే వాటిని అమలు చేయడం ఆరంభిస్తారు.నిజానికి ఈ సీజన్ లో సమృద్దిగా విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయించుకునే అవకాశం ఉంది. కాని సకల జనుల సమ్మెలో భాగంగా విద్యుత్, సింగరేని బొగ్గు గనుల లో సమ్మెలు జరుగుతుండడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి ఎదురు కొనుగోలు చేయవలసి వస్తోంది.అయినా విద్యుత్ కోత తప్పడం లేదు. ఈ నేపధ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా విద్యుత్ ఛార్జీల భారం పెరుగుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి