సిఎం కి టి-ఎమ్మెల్యేల మద్దతు..?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడిప్పుడే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఈ పరిణామంపై ఆయన సంతోషంగా కన్పిస్తున్నారని ఆయన వద్దకు వెళ్లివచ్చిన కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.గత రెండు రోజులలో రెండు బ్యాచ్ లుగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విద్యాసంస్థలను సమ్మె నుంచి మినహాయించాలని జెఎసిని కోరుతుండడం విశేషం. ఇందుకోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితుడైన శాసనమండలి సభ్యుడు రంగారెడ్డిని ఉపయోగించారని తెలిసింది. తెలంగాణాకే చెందిన ఈ ఎమ్మెల్సీ మేడ్చల్ ఎమ్మెల్యే కె.ఎల్.రెడ్డితో చర్చలు జరిపి విద్యాసంస్థల విషయమై ముందుగా సిఎల్పి కార్యాలయంలో మాట్లాడించారు. ఆ తర్వాత రోజు సుధీర్ రెడ్డి వంటి నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారు. గత నెల రోజులలో మొదటిసారిగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా మీడియాతో మాట్లాడారు.అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు మాత్రం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్.పిల మధ్య విబేధాలు మొదలయ్యాయని అంటున్నారు. రైల్ రకో కార్యక్రమానికి ఎవరిని అడిగి వెళుతున్నారని ఎమ్.పిలను కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. స్టీరింగ్ కమిటీ ఏమైందో తెలియకుండా పోయిందని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంతమంది తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ పార్టీని బజారులో నిలబెడుతున్నారని వారు అంటున్నారు.ఈ పరిణామాలన్నిటితో ముఖ్యమంత్రి కిరణ్ కాస్త తేరుకుంటున్నారని, అయితే ఆయన ధోరణిలో మరింత మార్పు రావలసి ఉందని ఒక ఎమ్మెల్సీ అన్నారు. అందరిని ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడడం కాకుండా, వేర్వేరు గా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.అలాగే ఎవరు ఏమి చెప్పినా ముందుగానే సి.ఎమ్. ఐ నో అనో లేక నాకు తెలుసు అనో అంటుండడం వల్ల విషయాలు చెప్పలేకపోతున్నామని కొందరు నేతలు అంటున్నారు. మొత్తం మీద కిరణ్ కు మారుతున్న పరిణామాలు కాస్త సంతోషంగా కలిగించేవే అయినా ఆయన పూర్తిగా సంక్షోభం నుంచి బయటకు వచ్చినట్లు కాదని అంతా ఒప్పుకుంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి