ఏడు ప‌దుల న‌వ యువ‌కుడు బిగ్‌బి..


బాలీవుడ్ బాదుషా, సూప‌ర్ స్టార్‌, బిగ్‌బి, యాంగ్రీ యంగ్ మ్యాన్‌.. ఇలా ఎన్నో బిరుదులు ఆయ‌న సొంతం.. హిందీ సినిమా చ‌రిత్రలో ఆయ‌న‌కంటూ ఒక ప్రత్యేక మైన స్థానం నెల‌కొల్పుకున్న వ్యక్తి.. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ న‌టీన‌టుల‌కు స్ఫూర్తినందిస్తున్న గొప్ప వ్యక్తి. ఆయ‌న పేరు చెబితే సినిమా ప్రియులు పుల‌కించిపోతారు. ఒడిదుడుకులు, ఎత్తు ప‌ల్లాలు ఎన్ని ఎదుర‌యినా ఆయ‌న మాత్రం అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూనే ఉంటాడు. అత‌నే బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చన్‌.

1970, ’80ల్లో చేసిన అనేక సినిమాల్లో ‘విజయ్’గా కనిపించి, విజయ సోపానాలు అధిరోహించి, తన సినీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు అమితాబ్. ఇందులో ‘విజయ్’ పాత్ర సృష్టికర్తలైన సలీమ్ (ఖాన్) – జావెద్ (అఖ్తర్) ద్వయం పాత్ర ఎంతో ఉంది.
‘జంజీర్’లో చిన్నప్పుడే తల్లిదండ్రుల హత్యని కళ్లారా చూసిన ఆయన, అవివాహిత పుత్రుడిగా, తండ్రి ఎవరో తెలీకుండా పెరిగిన యువకుడిగా ‘త్రిశూల్’లో కనిపించారు.
‘దీవార్’లో అయితే ఓ గొడవలో మొత్తం కుటుంబాన్నే కోల్పోయినవాడిగా కనిపించారు. ఇలాంటి నేపథ్యాలతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా రూపొందాడు ‘విజయ్’. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దుష్టుల అంతం చూసే ఆ పాత్రతో ప్రేక్షకులు సహానుభూతి చెందారు. విజయ్ నవ్వితే వారూ నవ్వారు. విజయ్ ఏడిస్తే వారూ ఏడ్చారు.
అతను దుష్టుల్ని వెంటాడి వేటాడి చంపుతుంటే తామే వాళ్లని చంపుతున్నట్లు ఆ పాత్రలో మమేకమయ్యారు. ఆ పాత్రల పోషణతో అంతగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశారు అమితాబ్.
అప్పుడే కాదు, అరవై ఏళ్లు దాటినా కూడా ఆయన పట్ల ప్రేక్షకుల్లో అభిమానం తగ్గలేదనడానికి ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. ‘సర్కార్’, ‘కభీ అల్విదా నా కెహనా’, ‘నిశ్శబ్డ్’, ‘చీనీ కుమ్’, ‘భూత్‌నాథ్’, ‘సర్కార్ రాజ్’, ‘పా’, ‘ఆరక్షణ్’ వంటి ఒకదానికొకటి పూర్తి భిన్నమైన చిత్రాలతో ఆయన ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసల్ని పొందారు.
‘పా’ చిత్రంలో చూపులకి అరవై ఏళ్ల వృద్ధుడిగా కనిపించే పన్నెండేళ్ల పిల్లాడి పాత్రను అమోఘంగా పోషించి, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించడం అపూర్వం. ఇక ఇటీవలే 69 సంవత్సరాల వయసులో ‘బుడ్డా… హోగా తేరా బాప్’ సినిమాలో యాక్షన్ రోల్ చేసి అబ్బుర పరచడం అమితాబ్‌కే చెల్లింది. ఈ చిత్రంలో కిల్లర్ గా న‌టించ‌డం ఒక ఎత్తయితే యువ‌కుల‌కంటే వేగంగా ఖ‌రీదైన బైక్‌పై స్వారీ చేయ‌డం మ‌రో ఎత్తు. ఇక బుల్లి తెర‌పై కూడా బిగ్ బి పెను సంచ‌న‌మే సృష్టించారు. 1990వ ద‌శ‌కంలో వ‌చ్చిన కోన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి ప్రోగ్రాం యావ‌త్ భార‌త‌దేశాన్ని త‌న వైపుకి తిప్పుకుంది. దీనికి కేవ‌లం ఆ ప్రోగ్రాం కి యాంక‌ర్‌గా అమితాబ్ చేయ‌డ‌మే.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిన‌ట్టుండాల‌న్న నానుడికి అమితాబ్ చ‌క్కగా స‌రిపోతారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా త‌న కోస్టార్స్‌తో ఎంతో విన‌యంగా ఉండ‌డం ఆయ‌న నైజం. ఎన్నిసార్లు ఆరోగ్య సమస్యలు తలెత్తినా మొక్కవోని దీక్షతో, అంకితభావంతో, చలాకీతనంతో నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న బిగ్ బి రానున్న రోజుల్లో మరిన్ని వైవిధ్యభరిత పాత్రలతో యావ‌త్ భార‌త ప్రేక్షకుల‌నే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతీ భార‌తీయుడినీ అల‌రించాల‌ని కోరుకుంటూ బిగ్‌బి అమితాబ్‌కి 5amnew.com జ‌న్మదిన శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!